పంచవ్యాప్తంగా లాక్‌డౌన్ వల్ల లక్షలాది మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకున్నారు. వారందర్నీ మే 7వ తేదీ నుంచి ఇండియాకు దశలవారీగా తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. దీని కోసం భారీ ఆపరేషన్ చేపట్టనున్నారు. విమానాలు, భారీ నౌకల ద్వారా తరలింపు ఉంటుందని ప్రభుత్వం పేర్కొన్నది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మార్చి 22వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలను రద్దు చేసిన విషయం తెలిసిందే. నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లయిట్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఆ విమాన సేవలు పేమెంట్ ఆధారంగా ఉంటుందని కేంద్రం తెలిపింది. విమానం ఎక్కేముందు ప్రతి ప్రయాణికుడికి పరీక్షలు చేపడుతామని, కేవలం లక్షణాలు లేని వారిని మాత్రమే భారత్‌కు తీసుకువస్తామన్నారు. ఒకసారి భారత్‌కు చేరుకున్న తర్వాత.. వారంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 14 రోజుల క్వారెంటైన్ తర్వాత కోవిడ్19 పరీక్ష చేయించుకోవాలి. అయితే ఎంత మంది భారతీయులను వెనక్కి రప్పించే ప్రణాళిక వేశారన్న విషయం స్పష్టంగా తెలియదు. తొలుత గల్ఫ్ దేశాల నుంచి ఆ తర్వాత యురోప్ దేశాల్లో చిక్కుకున్నవారిని తీసుకురానున్నారు. గల్ఫ్ దేశాల్లో సుమారు 80 లక్షల మంది భారతీయులు ఉన్నారు.